AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ రేవంత్ సర్కారుకు బిగ్ షాక్: బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేత, ‘పాత విధానంలో ఎన్నికలకు పోవచ్చు’ అని వ్యాఖ్య

తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అంశంలో సుప్రీంకోర్టులో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన స్టేపై కాంగ్రెస్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేస్తూ, పాత రిజర్వేషన్ల విధానంలోనే ఎన్నికలకు వెళ్లవచ్చని సూచించింది. ఈ తీర్పు రేవంత్ సర్కారుకు పుండు మీద కారం చల్లినట్లైందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదనలు వినిపించారు. రిజర్వేషన్లు నిర్ణయించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని, అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపాయన్నారు. శాస్త్రీయంగా కుల సర్వే నిర్వహించి, ఎంపరికల్ డేటా ఆధారంగానే రిజర్వేషన్లు నిర్ణయించామని, ఇది ఇందిరా సహాని కేసు తీర్పుకు అనుగుణంగా ఉందని కోర్టుకు నివేదించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీగా ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించామని, రిజర్వేషన్లు పెంచేందుకు అవసరమైన ట్రిపుల్ టెస్ట్ కండిషన్‌ను ప్రభుత్వం అమలు చేసిందని సింగ్వి కోర్టుకు తెలిపారు.

అయితే, రాష్ట్రపతి/గవర్నర్ ఆమోదం బిల్లుకు పెండింగ్‌లో పెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, ఏకాభిప్రాయంతో ఆమోదించిన బిల్లును పెండింగ్‌లో పెట్టారని న్యాయవాది వాదించారు. అయినప్పటికీ, ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వ పిటిషన్‌ను కొట్టివేస్తూ, హైకోర్టులో కేసు విచారణ కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత రావడంతో పాటు, రాజకీయ వ్యూహాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ANN TOP 10