AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ప్రధాని మోదీ సభలో విషాదం: కర్నూలు నన్నూరులో విద్యుత్ షాక్‌తో ఒక యువకుడు దుర్మరణం,ఇద్దరికి గాయాలు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలోని నన్నూరులో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్’ సభలో పాల్గొన్నారు. అయితే, ఈ భారీ బహిరంగ సభ ప్రాంగణం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సభ జరుగుతున్న సమయంలో విద్యుత్ షాక్‌కు గురై ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతిచెందిన యువకుడిని కర్నూలు జిల్లా మామిడాలపాడుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటన సభలో భారీ ఏర్పాట్లు, పటిష్ట భద్రత మధ్య జరగడం కలకలం సృష్టించింది.

సభ జరుగుతుండగా, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కొందరు ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి సభా ప్రాంగణం నుంచి తరలించే క్రమంలో ఈ ఊహించని విద్యుత్ షాక్ సంఘటన జరిగింది. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కోడుమూరు టీడీపీ ఇంఛార్జి డి. విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. మోదీ పర్యటన ఎటువంటి ఆటంకం లేకుండా ముగిసినప్పటికీ, ఈ విషాద ఘటన సభపై నీలినీడలు కప్పింది.

నన్నూరులో ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఈ సభకు సుమారు 3 లక్షల మంది హాజరైనట్టు అంచనా. ఈ పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్రంలో రూ. 13,429 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. వర్చువల్ విధానంలో రూ. 9449 కోట్ల విలువైన 5 అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రూ. 1704 కోట్ల విలువైన 8 ప్రాజెక్ట్‌లను ప్రారంభించారు. గత 16 నెలలుగా ఏపీ ప్రగతి పథంలో దూసుకెళ్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి ఏపీ అభివృద్ధి కీలకమని మోదీ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

ANN TOP 10