పిఠాపురం టీడీపీ నేత వర్మపై మంత్రి నారాయణ మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో ఒకటి వైరల్ అయింది. ఈ ఆడియోలో వర్మను ‘జీరో’ చేశామని, కూటమి నాయకత్వంపై విమర్శలు చేయకుండా నియంత్రించామని నారాయణ పేర్కొన్నారు. దీనిపై వర్మ పరోక్షంగా స్పందిస్తూ సెటైర్లు వేశారు. “ఎవడో కర్మ అంటే నాకేంటి? ఎవడో గడ్డిపరక వర్మ అంటే నాకేంటి?” అని ప్రశ్నించారు. తాను ఎప్పుడూ టీడీపీకి ఫైర్ బ్రాండ్‌నే అని, చంద్రబాబు నాయకత్వంలో తనది 23 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణమని స్పష్టం చేశారు.
కూటమి బలోపేతం కోసం తాను మౌనంగానే ఉంటానని, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సమాధానం చెప్పనని వర్మ ప్రకటించారు. చంద్రబాబు, లోకేష్‌లపై తనకున్న ప్రేమ వారికి తెలుసని, ఎవరో ఏదో అన్నారని తాను లక్ష్మణ రేఖ దాటనని స్పష్టం చేశారు. తనంటే ఏమిటో పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకానికి తెలుసని నారాయణ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. చంద్రబాబు ఆదేశాల మేరకు గత ఎన్నికల్లో తాను, తన భార్య, కుమారుడు ప్రచారం చేశామని గుర్తు చేశారు.
మంత్రి నారాయణ ఆడియోలో కూటమి నేతల మధ్య వివాదాలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాల గురించి వివరించారు. ఎవ్వరూ మాట్లాడొద్దని, అంతర్గత విషయాలు ఉంటే తనకు చెప్పాలని ఆదేశాలు ఉన్నాయన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత, తమ పార్టీ నేత (వర్మ)తో ఘర్షణ జరుగుతోందని, వర్మ దూకుడు ఉన్న వ్యక్తి అయినప్పటికీ, కూటమి నేతలకు వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టడంతో, గత మూడు నాలుగు నెలలుగా అతన్ని ‘జీరో’ చేశామని నారాయణ పేర్కొనడం ఈ వివాదానికి మూలమైంది.