తెలంగాణ విద్యార్థులకు వరుస సెలవులు కొనసాగుతున్నాయి. దసరా హాలిడేస్ తర్వాత, ఈ నెలలో దీపావళి సందర్భంగా అధికారికంగా ఒకే రోజు సెలవు ఉన్నప్పటికీ, ఆదివారం కలసి రావడంతో రెండు రోజులు సెలవులు వచ్చాయి. అయితే, అక్టోబర్ 18న అదనంగా మరో సెలవు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఆ రోజున రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. ఈ బంద్‌కు బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలు సైతం మద్దతు ప్రకటించడంతో, విద్యాసంస్థలు మూసివేయబడే అవకాశాలు ఉన్నాయి.
బీసీ సంఘాలు పిలుపునిచ్చిన అక్టోబర్ 18న (శనివారం) బంద్ కారణంగా, అనేక స్కూళ్లు, కాలేజీలు ముందుగానే సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ఒకవేళ విద్యాసంస్థలు సెలవు ఇవ్వకపోయినా, బీసీ విద్యార్థి సంఘాలు మరియు బంద్‌కు మద్దతిచ్చే రాజకీయ పక్షాలు వాటిని మూసివేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, అక్టోబర్ 18న విద్యాసంస్థలు, ఆఫీసులు నడిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు.
ఒకవేళ ఈ బంద్ విజయవంతంగా జరిగితే, విద్యార్థులకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. శనివారం (అక్టోబర్ 18) బంద్ కారణంగా, ఆదివారం (అక్టోబర్ 19) వీక్లీ హాలిడే, ఆ తర్వాత సోమవారం (దీపావళి సెలవు) కలిసి రావడంతో విద్యార్థులకు పండగ వాతావరణం నెలకొనే అవకాశం ఉంది.