AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్ బోగస్ ఓట్ల పిటిషన్‌పై బీఆర్ఎస్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ: ఎన్నికల ప్రక్రియలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గరపడుతుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఈ నేపథ్యంలో, నియోజకవర్గంలో బోగస్ ఓట్లు ఉన్నాయంటూ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అభ్యర్థి మాగంటి సునీత హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఒకే చిరునామాలో 43 మంది ఓటర్లు నమోదు కావడం, నియోజకవర్గంతో సంబంధం లేని 12,000 మందికి ఓట్లు ఉన్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. ఆధారాలు సమర్పించినా ఈసీ చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు.

బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో బోగస్ ఓట్ల అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్‌ను రివిజన్ చేస్తోందని కోర్టు వెల్లడించింది. బీఆర్ఎస్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వొకేట్ శేషాద్రి నాయుడు, ఒకే ఇంట్లో 43 మంది ఓటర్లు ఉన్నారని, 12,000 మంది బయటి వ్యక్తులకు ఓట్లు ఉన్నాయని కోర్టుకు నివేదించారు.

ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, నామినేషన్ల చివరి రోజు వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రతినిధులు ఇచ్చిన రిప్రజెంటేషన్లపై ఎన్నికల అధికారిని ఆదేశించామని, వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని కోర్టుకు వెల్లడించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్, నవంబర్ 14న ఫలితాలు వెలువడనున్నాయి.

ANN TOP 10