AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత యాత్ర: కేసీఆర్ ఫొటో లేకపోవడంపై వివరణ, కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తాను తలపెట్టనున్న ‘జాగృతి జనం బాట’ యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ యాత్ర ప్రతీ జిల్లాలో రెండు రోజుల చొప్పున మొత్తం 4 నెలల పాటు కొనసాగుతుందని వివరించారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభం కానున్న యాత్ర ఫిబ్రవరి 13వ తేదీ వరకు సాగనుంది.

ఈ యాత్ర పోస్టర్‌లో తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫొటో లేకపోవడంపై కవిత స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఒక పార్టీకి కేసీఆర్ అధ్యక్షుడు. ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేశారు. అందుకే ఆయన ఫోటో పెట్టుకుని యాత్ర చేయడం నైతికంగా సరైంది కాదు,” అని పేర్కొన్నారు. కేసీఆర్ తన తండ్రి అని, ఆయన కడుపున పుట్టడం తన అదృష్టమని పేర్కొన్న కవిత, అదే సమయంలో కేసీఆర్ ఫోటోను యాత్రలో ఉంచడం తన నైతిక విలువలకు విరుద్ధమని స్పష్టం చేశారు. యాత్ర తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోలతో కొనసాగుతుందని తెలిపారు.

మరోవైపు, తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ఏ వర్గం కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా లేదని, ప్రజల సమస్యలు పక్కనపెట్టి.. ప్రతిపక్షాలను వేధించే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని ఆమె ఆరోపించారు. భౌగోళిక తెలంగాణ సాధించినా, ఇంకా సామాజిక తెలంగాణ సాధించలేదని, ఆ పోరాటం కోసమే తాను ప్రజల దగ్గరకు వెళ్తున్నానని కవిత వివరించారు.

ANN TOP 10