ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 16న ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన సుమారు రూ.13,430 కోట్ల విలువైన 16 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. వీటిలో ఓర్వకల్ పారిశ్రామిక స్మార్ట్ సిటీ, డ్రోన్ సిటీ, కొప్పర్తి పార్కు, రహదారి, రైల్వే ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంత పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని, రూ. 21 వేల కోట్ల పెట్టుబడులు, భారీగా ఉద్యోగవకాశాలు రానున్నయని ప్రభుత్వం చెబుతోంది.
ప్రధాని మోదీ తన పర్యటనలో భాగంగా కర్నూలు నగర శివారులోని నన్నూరు టోల్ ప్లాజా వద్ద నిర్వహించనున్న “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో పాల్గొంటారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ-2.0పై అవగాహన కల్పించే తొలి సభ ఇదే కావడం విశేషం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర కేంద్ర, రాష్ట్ర మంత్రులు, కూటమి నాయకులు హాజరుకానున్నారు.
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా, అక్టోబర్ 15, 16 తేదీల్లో కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కర్నూలు రూరల్, అర్బన్, కల్లూరు, ఓర్వకల్ మండలాల్లోని విద్యాసంస్థలు ఈ రెండు రోజులు మూసివేస్తారు. ఈ రోజుల్లో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్ 21, 22 తేదీలకు వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటన సందర్భంగా శ్రీశైలంలోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.