తెలుగు చలనచిత్ర రంగంలో తొలి తరం నేపథ్య గాయనిగా చరిత్ర సృష్టించిన రావు బాలసరస్వతి దేవి గారి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సినీ నటుడు బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు. ఆయన, అలాగే బాలకృష్ణ కూడా ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
బాలకృష్ణ స్పందిస్తూ… ప్రముఖ తెలుగు సినిమా గాయకురాలు, నటి రావు బాలసరస్వతి దేవి (97) అకాల మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఆమె చిన్ననాటి నుండే కళారంగంలో ప్రవేశించి 1930ల నుండి 1960ల వరకు తెలుగు, తమిళ సినిమాల్లో గాయనిగా, నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమాల్లో మొదటి ప్లేబ్యాక్ సింగర్‌గా ‘భాగ్యలక్ష్మి’ చిత్రంలో “థిన్నే మీద సిన్నోడ” పాటకు స్వరం ఇచ్చి చరిత్ర సృష్టించారని బాలకృష్ణ గుర్తు చేశారు.
తెలుగులో ‘షావుకారు’, ‘పిచ్చి పుల్లయ్య’ వంటి ఎన్నో చిత్రాలకు పాటలు పాడి తెలుగు ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారని తెలిపారు. ఆల్ ఇండియా రేడియోలో మొదటి ‘లైట్ మ్యూజిక్’ గాయకురాలిగా పేరు తెచ్చుకున్న ఆమె, 2 వేలకుపైగా పాటలు పాడి తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయారని బాలకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.