AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

 బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కుమార్తె అక్షరపై కేసు నమోదు – ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలు:జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె మాగంటి అక్షరపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి (కోడ్) ఉల్లంఘన కేసు నమోదైంది. వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద అనుమతి లేకుండా ప్రచారం నిర్వహిస్తూ, ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణల మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు ఆధారంగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో యూసుఫ్‌గూడ కార్పొరేటర్ రాజ్‌కుమార్ పటేల్‌తో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదు అయ్యాయి.

ప్రచారం ముమ్మరంగా సాగుతున్న వేళ, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, ఆమె కుమార్తె అక్షరతో పాటు మరికొందరు పార్టీ నాయకులు శుక్రవారం మధ్యాహ్నం వెంకటగిరిలోని ఓ ప్రార్థన మందిరం వద్ద బీఆర్ఎస్ కండువాలు ధరించి, కరపత్రాలతో కనిపించారు. మతపరమైన ప్రదేశాలలో రాజకీయ ప్రచారం చేయకూడదనే ఎన్నికల కోడ్ నిబంధనను ఉల్లంఘిస్తూ, ప్రార్థనలు చేసుకుని వస్తున్న వారిని తమ మాటలతో ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ డిప్యూటీ తహసీల్దార్ ఫ్రాన్సిస్ తన సిబ్బందితో కలిసి తనిఖీలలో గుర్తించారు.

ఈ సంఘటనపై ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మసీదు వద్ద ప్రచారం చేసినందుకు గాను మాగంటి సునీతను A1గా, ఆమె కుమార్తె మాగంటి అక్షరను A2గా, యూసుఫ్‌గూడ కార్పొరేటర్ సహా మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులను చేరుస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ఆరోపణలు బీఆర్ఎస్ అభ్యర్థికి ఊహించని షాక్‌గా మారాయి.

ANN TOP 10