AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు ఐ క్లౌడ్ పాస్‌వర్డ్ చెప్పాల్సిందే – సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీం కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు తన ఐ క్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులకు చెప్పాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు ప్రభాకర్ రావు తన యాపిల్ ఐ క్లౌడ్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసి, ఆ సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఇవ్వాలని జస్టిస్‌ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్ ధర్మాసనం సూచించింది. ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో ఈ సమాచారాన్ని తీసుకోవాలని సిట్‌ను ఆదేశించింది.

ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా, దర్యాప్తునకు ప్రభాకర్ రావు సహకరించడం లేదని, కోర్టు రక్షణ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ఐ క్లౌడ్‌లోని సమాచారాన్ని డిలీట్ చేశారని తెలంగాణ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు నివేదించారు. ప్రభాకర్ రావు గురించి కొన్ని విషయాలు చెబితే కోర్టు కూడా షాక్‌కు గురవుతుందని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా, ప్రభాకర్ రావు తరఫు సీనియర్ అడ్వొకేట్ దామ శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ, తమ క్లయింట్ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నారని, 11 సార్లు విచారించారని, అయితే పాత ఐ క్లౌడ్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను మరిచిపోయారని తెలిపారు.

అయితే, ఐ క్లౌడ్‌లోని సమాచారాన్ని డిలీట్ చేయడానికి ప్రయత్నించినట్లు తేలితే, నిందితుడిపై తదుపరి చర్యల గురించి ఆలోచిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభాకర్ రావు పాస్‌వర్డ్ చెప్పిన తర్వాత, ఐ క్లౌడ్ సమాచారాన్ని పోలీసులు తెలుసుకుంటే ఈ కేసులో డొంక కదిలే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం కోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. అలాగే, ప్రభాకర్ రావుకు అరెస్టు నుంచి ఇచ్చిన మధ్యంతర రక్షణను పొడిగించింది.

profile picture

ANN TOP 10