మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. మేడారం జాతర కాంట్రాక్టు పనులను పొంగులేటి తన సొంత కంపెనీకి ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కొండా దంపతులు ఆరోపించారు. ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పొంగులేటి స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
తన గురించి అందరికీ తెలుసని ఆయన అన్నారు. తాను రూ. 70 కోట్ల కాంట్రాక్టు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు. తనపై ఫిర్యాదు చేయడానికి అసలు విషయమేముందని ప్రశ్నించారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖలు ఇద్దరూ సమ్మక్క, సారక్కల్లా పనిచేస్తున్నారని ప్రశంసించారు.
మేడారం అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ, మేడారం అభివృద్ధికి రూ. 212 కోట్ల నిధులతో మాస్టర్ ప్లాన్ రూపొందించామని అన్నారు. నిధులు ఎక్కువైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేడారంలో భక్తులకు అన్ని రకాల సదుపాయాలు ఉండాలని ఆకాంక్షించారు. అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటామని అన్నారు. ఎంత ఖర్చైనా మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు.
