వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో నాణ్యత లేని లడ్డూలు విక్రయిస్తున్నారంటూ భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. లడ్డూలకు బూజు పట్టాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూలు ఉంచిన ట్రేల నుంచి దుర్వాసన వస్తున్నట్లు భక్తులు తెలిపారు. ఎంతో పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని ఇలా విక్రయించడమేంటని భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్పందించిన మంత్రి కొండా సురేఖ
వేములవాడలో లడ్డూలకు బూజు పట్టిన ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ స్పందించారు. సంబంధిత అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించారు. దేవాలయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని మంత్రి సూచించారు. ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లడ్డూ ప్రసాదంపై భక్తుల నుంచి విమర్శలు రావడంతో ఆహార భద్రతా అధికారులకు లేఖ రాసినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతామని, భక్తుల మనోభావాలను గౌరవిస్తామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని ఆమె పేర్కొన్నారు.