సరిహద్దుల్లో శత్రు దేశాల నుంచి డ్రోన్ల ముప్పు పెరుగుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత సైన్యం కీలక చర్యలు చేపట్టింది. పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘సాక్షమ్’ (SAKSHAM) అనే అత్యాధునిక కౌంటర్ డ్రోన్ వ్యవస్థను కొనుగోలు చేసే ప్రక్రియను ప్రారంభించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ స్ఫూర్తితో ఘజియాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ఈ వ్యవస్థను రూపొందించింది.
ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాకిస్థాన్ ప్రయోగించిన దాదాపు 400 డ్రోన్లను భారత భద్రతా దళాలు విజయవంతంగా నిర్వీర్యం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత, డ్రోన్లను ఎదుర్కోవడానికి ఒక పటిష్టమైన వ్యవస్థ అవసరాన్ని సైన్యం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ‘సాక్షమ్’ కొనుగోలుకు ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్‌మెంట్ (FTP) విధానంలో ఆమోదం తెలిపింది. రాబోయే ఏడాదిలోగా ఈ వ్యవస్థను అన్ని సైనిక క్షేత్రాలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
గతంలో సైన్యం కేవలం భూభాగంపైనే దృష్టి సారించేది. కానీ ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా, భూమికి 3,000 మీటర్ల (10,000 అడుగుల) ఎత్తు వరకు ఉన్న గగనతలాన్ని కూడా ‘వ్యూహాత్మక యుద్ధ క్షేత్రం’ (Tactical Battlefield Space)గా పరిగణిస్తున్నారు. ఈ ప్రాంతంలో శత్రు డ్రోన్లు, విమానాలను గుర్తించి, వాటిని నాశనం చేస్తూనే.. మన వైమానిక దళాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడటమే ‘సాక్షమ్’ ప్రధాన లక్ష్యమని రక్షణ శాఖ అధికారులు వివరించారు.
‘సాక్షమ్’ వ్యవస్థ ఒక మాడ్యులర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌గా పనిచేస్తుంది. ఇది శత్రు డ్రోన్లను నిజ సమయంలో గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని నిర్వీర్యం చేయడం వంటి పనులను చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ, ముప్పును ముందుగానే పసిగట్టి కమాండర్లకు వేగంగా నిర్ణయాలు తీసుకునేందుకు సహకరిస్తుంది. సెన్సార్లు, సాఫ్ట్‌కిల్, హార్డ్‌కిల్ ఆయుధ వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తెచ్చి, గగనతలంలో పూర్తి స్థాయి భద్రతను అందిస్తుంది.
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-పాలస్తీనా వంటి ఆధునిక యుద్ధాల్లో డ్రోన్ల పాత్ర పెరిగిన తరుణంలో, భారత సైన్యం ఈ వ్యవస్థను సమకూర్చుకోవడం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.