AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

42 శాతం బీసీ రిజర్వేషన్లు కూడా ఓ డ్రామా.. హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు..

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే విధించడం తెలిసిందే. ఈ పరిణామంపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. బీసీలకు రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ డ్రామా ఆడుతోందని, బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర పన్నిందని ధ్వజమెత్తారు. కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కాంగ్రెస్ పార్టీ ఇలాంటి ఎత్తుగడలు వేస్తోందని, వారి కుట్రలు ఇప్పుడు పటాపంచలయ్యాయని అన్నారు.

 

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టినట్లే, ఇప్పుడు 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో మరో డ్రామాకు తెరతీశారని హరీశ్ రావు ఆరోపించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, 22 నెలలుగా ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్లీలో డ్రామాలు సృష్టిస్తున్నారు తప్ప, అసలు పోరాటం చేయాల్సిన ఢిల్లీలో మౌనంగా ఉన్నారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలంటే, దానికి చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా రేవంత్ రెడ్డి ఎందుకు ఒత్తిడి తేవడం లేదని ఆయన ప్రశ్నించారు.

 

కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేసేందుకే ప్రభుత్వం తూతూమంత్రంగా జీవో ఇచ్చి చేతులు దులుపుకుందని హరీశ్ రావు ఆరోపించారు. “55 ఏళ్ల పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీసీ రిజర్వేషన్ల కోసం ఏనాడూ చిత్తశుద్ధితో పనిచేయలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీలపై కపట ప్రేమ చూపిస్తోంది. మీకు నిజంగానే బీసీలపై ప్రేమ ఉంటే, మీ జాతీయ నాయకులతో కలిసి ఢిల్లీలో పోరాటం చేయండి. పార్లమెంటులో ఈ అంశంపై చట్టం చేయించి, దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్పించండి. అప్పుడే బీసీలకు నిజమైన న్యాయం జరుగుతుంది” అని ఆయన సవాల్ విసిరారు.

 

బీసీల హక్కుల కోసం ఢిల్లీ వేదికగా చేసే పోరాటంలో అఖిలపక్షాలను భాగస్వామ్యం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఉద్యమ పార్టీగా బీఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల పక్షాన నిలుస్తుందని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి డ్రామాలు ఆపి, బీసీల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని హరీశ్ రావు హితవు పలికారు.

ANN TOP 10