AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జైషే మహమ్మద్ సరికొత్త ఎత్తుగడ..! వారే టార్గెట్..!

పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ తన కార్యకలాపాలను విస్తరించేందుకు సరికొత్త, ప్రమాదకరమైన కుట్రకు తెరలేపింది. ఇప్పటివరకు యువకులనే లక్ష్యంగా చేసుకున్న ఈ సంస్థ.. తాజాగా విద్యావంతులైన ముస్లిం మహిళలను ఉగ్రవాదం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని భారత నిఘా వర్గాలు సంచలన విషయాలు వెల్లడించాయి. మతపరమైన ప్రసంగాలు, భావోద్వేగపూరిత సందేశాలతో వారిని బ్రెయిన్‌వాష్ చేసి తమ నెట్‌వర్క్‌లో చేర్చుకోవడానికి పక్కా ప్రణాళికతో ముందుకెళుతున్నట్లు గుర్తించాయి.

 

జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేసే ‘జమాతుల్-ముమినాత్’ అనే సంస్థ ఈ నియామకాల్లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఈ సంస్థ 2004 నుంచే చురుకుగా ఉన్నప్పటికీ, ఇటీవల తన కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్, ఉత్తరప్రదేశ్, దక్షిణ భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే చదువుకున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికలతో పాటు మదర్సాల నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి ప్రచారం నిర్వహిస్తోంది.

 

ఉర్దూ భాషలో ముద్రించిన ప్రచార సామగ్రిలో మక్కా, మదీనా చిత్రాలు, ఖురాన్‌లోని శ్లోకాలను వాడుతూ మహిళలను ఆకర్షిస్తున్నారు. “ఈ వ్యవస్థ అల్లాహ్ ఇచ్చింది”, “ఈ వెలుగు ప్రపంచమంతా వ్యాపిస్తుంది” వంటి భావోద్వేగ నినాదాలతో వారిని ప్రలోభాలకు గురిచేస్తున్నారని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. హిజాబ్ ధరించడం, ప్రార్థనలు చేయడం ద్వారానే మతానికి సేవ చేసినట్లు అవుతుందని నమ్మించి, వారిని ఉగ్ర కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నట్లు తేలింది.

 

గతంలో భారత సైన్యం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్, పంజాబ్ ప్రావిన్సులలో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ప్రధాన ఉగ్రవాద శిబిరాలను మన బలగాలు ధ్వంసం చేశాయి. ఈ దాడుల తర్వాత ఉగ్ర సంస్థలు తమ వ్యూహాన్ని మార్చుకున్నాయి. భవిష్యత్తులో భారత్ నుంచి ఇలాంటి దాడులను ఊహించి, తమ స్థావరాలను పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లోని కఠినమైన, దుర్భేద్యమైన ప్రాంతాలకు రహస్యంగా తరలిస్తున్నాయని నిఘా వర్గాలు గుర్తించాయి.

 

అయితే, ఉగ్రవాదులు ఎంత దూరం వెళ్లినా తమ ప్రతీకార చర్యల నుంచి తప్పించుకోలేరని భారత సైనిక వర్గాలు స్పష్టం చేశాయి. గత వారం భారత ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే, ఆ దేశం ప్రపంచ పటం నుంచే కనుమరుగయ్యే ప్రమాదం ఉందని తీవ్రస్థాయిలో హెచ్చరించిన విషయం తెలిసిందే.

ANN TOP 10