AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చిట్యాల తహసీల్దార్..

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మరో అవినీతి అధికారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక భూమికి సంబంధించిన పనుల కోసం చిట్యాల మండల తహసీల్దార్‌గా పనిచేస్తున్న గుగులోతు కృష్ణ ఓ ప్రైవేట్ సంస్థ నుంచి రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఈ ఘటనలో తహసీల్దార్‌తో పాటు మధ్యవర్తిగా వ్యవహరించిన గట్టు రమేశ్ అనే ప్రైవేట్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.

 

ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ‘ఎం/ఎస్ రత్న హౌసింగ్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థకు చెందిన ఒక వ్యవసాయ భూమి మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు, మరో వ్యవసాయ భూమి సర్వే నివేదికను స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్‌కు సమర్పించేందుకు తహసీల్దార్ కృష్ణ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, వారు పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగారు.

 

ఫిర్యాదుదారుడి నుంచి తహసీల్దార్ తరఫున గట్టు రమేష్ రూ.2 లక్షలు లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదును స్వాధీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

 

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం అడిగితే వెంటనే తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ANN TOP 10