తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ నాయకురాలు మాధవీలత ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం అవకాశం ఇస్తే ఎన్నికల యుద్ధానికి తాను సిద్ధమని ఆమె స్పష్టం చేశారు. బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆమె, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ, “బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల పాలనల వల్ల తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అధిష్ఠానం పరిశీలిస్తున్న అభ్యర్థుల జాబితాలో నా పేరు కూడా ఉందని తెలిసింది. పార్టీ నాకు అవకాశం కల్పిస్తే జూబ్లీహిల్స్లో తప్పకుండా పోటీ చేస్తాను” అని ధీమా వ్యక్తం చేశారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉండగా, ఎలాగైనా గెలిచి తమ బలాన్ని చాటాలని కాంగ్రెస్, బీజేపీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గంలో ప్రచార పర్వం ఊపందుకోనుంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,99,000గా ఉంది. వీరిలో 2,07,382 మంది పురుషులు, 1,91,593 మంది మహిళలతో పాటు 25 మంది ట్రాన్స్జెండర్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.