AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేడే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల..!

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఎన్నికల నోటిఫికేషన్‌పై హైకోర్టు స్టే ఇవ్వకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. తొలి విడతలో 53 రెవెన్యూ డివిజన్లు, రెండో విడతలో 50 రెవెన్యూ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి.

 

అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఏర్పాట్లను SEC పూర్తి చేసింది. ఈ మేరకు మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ దాఖలుకు సంబంధించి ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎంపీటీసీలకు మండల ఆఫీస్, జెడ్పీటీసీల కోసం జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరించనున్నారు. నాలుగైదు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు కలిపి ఒక ఆర్వోను నియమించారు. రిజల్ట్ వచ్చేవరకు పర్యవేక్షణ బాధ్యతలను ఆర్వో అధికారులకు అప్పగించారు.

 

తొలి రెండు విడతల్లో MPTC, ZPTC ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 23న తొలి విడత.. ఈ నెల 27న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించనున్నారు. నవంబర్ 11న MPTC, ZPTC ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. మొదటి విడతలో 2 వేల 963 MPTC, 292 ZPTC స్థానాలు ఉన్నాయి. అలాగే రెండో విడతలో 2 వేల 786 MPTC, 272 ZPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

 

31 జిల్లాల్లో 565 మండలాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు నిర్వహించనుంది. ఐదు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 565 ZPTC, 5749 MPTC స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేల 733 గ్రామ పంచాయతీలు, లక్షా 12 వేల 288 వార్డులకు మిగతా మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబర్‌ 31న మొదటిదశ.. నవంబర్‌ 4న రెండోదశ.. నవంబర్‌ 8న మూడోదశ గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

ANN TOP 10