AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నెట్ ఫ్లిక్స్ తో కేంద్రం కీలక ఒప్పందం..! ఇకపై వాటిపై ఫోకస్..!

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) రంగాల్లో రాణించాలనుకునే భారతీయ విద్యార్థులకు ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ అండగా నిలవనుంది. ఈ రంగంలో నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ (ఐఐసీటీ), ఫిక్కీతో కలిసి నెట్‌ఫ్లిక్స్ ఒక కీలక ఒప్పందం కుదుర్చుకుంది.

 

ఫిక్కీ ఫ్రేమ్స్ 25వ ఎడిషన్ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు సమక్షంలో ఈ మూడు సంస్థలు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఐఐసీటీ విద్యార్థుల కోసం పాఠ్యప్రణాళిక (కరికులం) అభివృద్ధిలో నెట్‌ఫ్లిక్స్ సహకరించనుంది. అంతేకాకుండా, పరిశ్రమలోని నిపుణులతో విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని అందించేందుకు కృషి చేయనుంది.

 

ఈ ఒప్పందం ద్వారా విద్యార్థులకు వర్క్‌షాప్‌లు, మాస్టర్‌క్లాస్‌లు, గెస్ట్ లెక్చర్‌లు నిర్వహించనున్నారు. తద్వారా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించి, వారిని పరిశ్రమకు సిద్ధం చేయనున్నారు. ఐఐసీటీతో కలిసి ఎంపిక చేసిన కొంతమంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా అందజేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.

 

ఈ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ఇండియా గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ మహిమా కౌల్ మాట్లాడుతూ, “భారత ఏవీజీసీ రంగాన్ని బలోపేతం చేయాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఈ ఒప్పందం కుదిరింది. ప్రతి సృజనాత్మక విద్యార్థికి సరైన అవకాశాలు కల్పించి, వినోద రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడమే మా లక్ష్యం” అని తెలిపారు.

 

ఐఐసీటీ సీఈఓ డాక్టర్ విశ్వాస్ దేవ్‌స్కర్ మాట్లాడుతూ, “విద్యా రంగానికి, సృజనాత్మక పరిశ్రమకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. ప్రపంచ స్థాయి శిక్షణతో తర్వాతి తరం కథకులను, టెక్నాలజీ నిపుణులను తయారు చేస్తాం” అని అన్నారు. ఫిక్కీ ఏవీజీసీ-ఎక్స్ఆర్ ఫోరమ్ ఛైర్మన్ ముంజల్ ష్రాఫ్ కూడా ఈ ఒప్పందంపై హర్షం వ్యక్తం చేశారు. ఇది భవిష్యత్తుకు అవసరమైన ప్రతిభను ప్రోత్సహించడానికి, స్థిరమైన వృద్ధికి మార్గం సుగమం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ANN TOP 10