AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

యూపీఐలో సరికొత్త ఫీచర్..! ఇకపై ఫింగర్ ప్రింట్స్ తో పేమెంట్..! ఎలా అంటే..?

దేశంలో కోట్లాది మంది వినియోగిస్తున్న యూపీఐ (UPI) చెల్లింపుల విధానంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లావాదేవీల కోసం ఇప్పటివరకు వాడుతున్న 4 లేదా 6 అంకెల పిన్ నంబర్‌కు బదులుగా బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇకపై వినియోగదారులు తమ ముఖ గుర్తింపు (ఫేస్ రికగ్నిషన్) లేదా వేలిముద్రల (ఫింగర్‌ప్రింట్స్) ద్వారా సులభంగా, సురక్షితంగా చెల్లింపులు పూర్తిచేయవచ్చు.

 

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ నూతన విధానాన్ని అభివృద్ధి చేసింది. ముంబైలో మంగళవారం జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్టివల్‌లో కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం. నాగరాజు ఈ సేవలను అధికారికంగా ప్రారంభించారు. ఈ కొత్త విధానం కేవలం పిన్‌కు ప్రత్యామ్నాయం మాత్రమేనని, ఇది చెల్లింపుల ప్రక్రియను మరింత వేగంగా, సురక్షితంగా మారుస్తుందని ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో వెల్లడించింది.

 

దేశవ్యాప్తంగా పిన్ ఆధారిత యూపీఐ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. పిన్, ఓటీపీలకు బదులుగా మరింత సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకురావాలని అన్ని ఆర్థిక సంస్థలను సూచించింది. ఆర్‌బీఐ ఆదేశాల మేరకే ఎన్‌పీసీఐ ఈ బయోమెట్రిక్ విధానాన్ని వేగంగా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెచ్చింది.

 

ముఖ్యంగా యూపీఐని కొత్తగా వాడేవారికి, పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడే వృద్ధులకు ఈ విధానం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పిన్ మర్చిపోతామనే ఆందోళన లేకుండా, తమ ముఖం లేదా వేలిముద్రతో క్షణాల్లో లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా డిజిటల్ చెల్లింపులు మరింత మందికి చేరువవుతాయని ఎన్‌పీసీఐ ఆశాభావం వ్యక్తం చేసింది.

ANN TOP 10