ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, సీఆర్డీఏ పరిధిలో ప్రత్యేక ప్రాజెక్టుల అమలుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల చట్టం కింద ప్రత్యేక వాహక సంస్థ (Special Purpose Vehicle – SPV) ఏర్పాటు చేయడానికి పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రాథమికంగా రూ.10 కోట్ల అధీకృత షేర్ క్యాపిటల్‌తో ఎస్పీవీ ఏర్పాటవుతుండగా, ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి 99.99 శాతం ఈక్విటీ భాగస్వామిగా ఉంటారు. మిగతా 0.01 శాతం ఈక్విటీ సీఆర్డీఏ మరియు ఇతర ప్రభుత్వ సంస్థలకు చెందుతుంది.
ఎస్పీవీ ద్వారా చేపట్టనున్న ప్రధాన ప్రాజెక్టులు:
* గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం
* నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం
* స్మార్ట్ ఇండస్ట్రీలు
* కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్
* స్పోర్ట్స్ సిటీ
* రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్
* రోప్ వే
* అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్
ఈ ప్రాజెక్టుల అమలుతో పాటు భవిష్యత్తులో చేపట్టే ఇతర ప్రత్యేక ప్రాజెక్టులు కూడా ఎస్పీవీ ఆధ్వర్యంలో కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
బోర్డు డైరెక్టర్లు వీరే
ఎస్పీవీకి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డులో సభ్యులుగా ఈ క్రింద అధికారులు ఉంటారు:
* ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి
* ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి
* రవాణా-రోడ్లు శాఖ ముఖ్య కార్యదర్శి
* భవనాలు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శులు
* సీఆర్డీఏ కమిషనర్
అదనంగా, పారిశ్రామిక రంగం నుంచి ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లను కూడా ఎస్పీవీకి నియమించనున్నారు. బోర్డు సభ్యుల నియామకాల్లో అవసరాలను బట్టి ప్రభుత్వం మార్పులు చేయగలదు. ఎస్పీవీకి ఎండీని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి నియమిస్తారు.
ఎస్పీవీ బాధ్యతలు – ముఖ్యాంశాలు:
* రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ సమన్వయంతో ప్రత్యేక ప్రాజెక్టుల రూపకల్పన, అభివృద్ధి, అమలు.
* సబ్సిడరీలు/ జాయింట్ వెంచర్ల రూపంలో ప్రాజెక్టుల నిర్వహణ.
* కొత్త ప్రాజెక్టుల కాన్సెప్ట్‌లు, ఫీజిబిలిటీ రిపోర్టులు, డీపీఆర్‌లు, ఆర్థిక నమూనాలు రూపొందించి ప్రభుత్వ అనుమతులు పొందడం
* పీపీపీ, ఈపీసీ, హైబ్రిడ్ యాన్యుటీ మోడళ్ల ద్వారా కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక, నిర్మాణం, నిర్వహణ.