AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హైదరాబాద్‌లో భూమికి రికార్డు ధర.. ఎకరం రూ. 177 కోట్లు..!

రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కొంతకాలంగా మందగమనంలో ఉందన్న ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) సోమవారం నిర్వహించిన ఈ-వేలంలో ఎకరం భూమి ఏకంగా రూ. 177 కోట్ల ధర పలికింది. ఇది హైదరాబాద్ చరిత్రలోనే అత్యధిక ధర కావడం గమనార్హం.

 

టీజీఐఐసీ వెల్లడించిన వివరాల ప్రకారం, రాయదుర్గంలో మొత్తం రెండు వేర్వేరు ప్లాట్లకు వేలం నిర్వహించారు. ఇందులో 7.67 ఎకరాల స్థలానికి జరిగిన వేలంలో ఎకరాకు రూ. 177 కోట్ల రికార్డు ధర లభించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రూ. 1,357.59 కోట్ల ఆదాయం సమకూరింది. మరో 11 ఎకరాల ప్లాట్‌కు జరిగిన వేలంలో ఎకరాకు రూ. 141.5 కోట్ల చొప్పున మొత్తం రూ. 1,556.5 కోట్లు వచ్చాయి. ఈ రెండు వేలాల ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ. 2,914 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లయింది. ఈ వేలం ప్రక్రియను జేఎల్‌ఎల్ ఇండియా, ఎంఎస్‌టీసీ సంస్థలు టీజీఐఐసీ తరపున నిర్వహించాయి.

 

హైదరాబాద్ స్థిరమైన అభివృద్ధిపై పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకమే ఈ భారీ ధరకు కారణమని టీజీఐఐసీ ఎండీ శశాంక తెలిపారు. ఈ వేలంలో స్థానిక డెవలపర్లతో పాటు జాతీయ స్థాయి సంస్థలు కూడా పాల్గొన్నాయని ఆయన వివరించారు. ఈ తాజా వేలం.. 2022లో కోకాపేట నియోపోలిస్‌లో ఎకరాకు పలికిన రూ. 100.75 కోట్ల రికార్డును చెరిపివేసింది.

 

అయితే, ఇటీవల హెచ్‌ఎండీఏ శివార్లలో నిర్వహించిన వేలంలో ఆశించిన స్పందన రాకపోవడంతో, తాజా రికార్డు ధరపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్ డల్‌గా ఉందనే అభిప్రాయాన్ని మార్చేందుకే ప్రభుత్వం ఈ విధంగా చేసిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇంత భారీ ధరకు భూమిని కొనుగోలు చేసిన సంస్థ పేరును అధికారులు వెల్లడించకపోవడం ఈ చర్చకు మరింత బలాన్నిస్తోంది.

ANN TOP 10