హైదరాబాద్ నగర శివారుల్లోని ఫాంహౌస్‌లలో యువత రహస్యంగా డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం ఈ మధ్యకాలంలో తరచుగా జరుగుతోంది. పోలీసులు ఆకస్మిక దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో డ్రగ్స్ పార్టీల దందా కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామం సమీపంలోని చెర్రీ ఓక్స్ ఫాంహౌస్‌పై పోలీసులు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి చేశారు. అక్కడ కొందరు మైనర్లు డ్రగ్స్, మద్యం సేవించి పార్టీ చేసుకుంటున్నట్లు గుర్తించారు.
సుమారు 50 మంది ఈ పార్టీలో పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. వీరంతా ఇన్‌స్టాగ్రామ్‌లోని ‘ట్రాప్‌హౌస్ 9ఎంఎం’ అనే పేజీ ద్వారా పరిచయమయ్యారు. పార్టీలో మైనర్లు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
రాజేంద్రనగర్ ఎస్‌వోబీ పోలీసులు ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. పార్టీలో పాల్గొన్న ఇద్దరు మైనర్లకు డ్రగ్ టెస్టులో గంజాయి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. అదనంగా 8 బాటిళ్ల విదేశీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.