దేశ సేవలో అమరుడైన ఓ జవాను చివరి కోరికను ఆయన సహచరులు నెరవేర్చారు.. ఆయన సోదరికి తామంతా అన్నయ్యలుగా మారారు. దగ్గరుండి వివాహం జరిపించి ఆశీర్వదించారు. సైనిక దుస్తులతో వెంట నడుస్తూ వధువును మండపానికి తీసుకువచ్చారు. ఇది చూసి అక్కడున్న అతిథుల కళ్లు చెమర్చాయి. హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన వివరాలు..
హిమాచల్ ప్రదేశ్ కు చెందిన ఆశిష్ కుమార్ సైన్యంలో సేవలందిస్తూ అరుణాచల్ ప్రదేశ్ లో అమరుడయ్యాడు. మరణించే ముందు తన సోదరి గురించి సహచరులకు చెబుతూ.. ఆమె వివాహ వేడుకలో తాను లేని లోటు కనిపించొద్దని, తన స్థానంలో ఆమెకు సోదరులుగా వెళ్లాలని సహచరులను కోరుతూ తుదిశ్వాస వదిలాడు. తాజాగా ఆశిష్ సోదరి ఆరాధన వివాహం నిశ్చయమైంది. తన సోదరుడితో కలిసి పనిచేసిన సైనికులకు ఆరాధన ఫోన్ చేసి, తన వివాహానికి రమ్మని ఆహ్వానించింది.
దీంతో ఆశిష్ సహచర సైనికులంతా హిమాచల్ ప్రదేశ్ లోని భార్లీ గ్రామానికి చేరుకున్నారు. వివాహ తంతులో భాగంగా వధువును ఆమె సోదరుడు మండపం వద్దకు తోడ్కొని రావాల్సి ఉండగా.. ఆశిష్ సహచర సైనికులు ఆరాధనకు సోదరులుగా మారారు. ఆరాధనను మండపానికి తోడ్కొని వచ్చారు. ఈ దృశ్యం చూసి అతిథుల కళ్లు చెమర్చాయి. ఈ వివాహానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.