పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత విషయంలో కీలక ముందడుగు పడింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, నవంబర్ 23న నీరవ్ మోదీని బ్రిటన్ నుంచి భారత్‌కు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇది నిజమైతే, పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడిని స్వదేశానికి రప్పించేందుకు భారత దర్యాప్తు సంస్థలు చాలాకాలంగా బ్రిటన్‌లో చేస్తున్న న్యాయపోరాటం ఫలించినట్లే అవుతుంది.
ఈ అప్పగింత ప్రక్రియ వేగవంతం కావడానికి భారత ప్రభుత్వం ఇటీవలే బ్రిటన్‌కు ఇచ్చిన ఓ కీలక హామీయే ప్రధాన కారణమని తెలుస్తోంది. నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించిన తర్వాత కేవలం ఆర్థిక మోసం, మనీ లాండరింగ్ అభియోగాలపై మాత్రమే విచారణ జరుపుతామని, ఇతర కేసులేవీ నమోదు చేయబోమని కేంద్రం స్పష్టమైన పూచీకత్తు ఇచ్చింది. సీబీఐ, ఈడీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్‌ఎఫ్‌ఐఓ), కస్టమ్స్, ఆదాయపు పన్ను శాఖ అధికారులు సంయుక్తంగా ఈ హామీపత్రాన్ని బ్రిటన్ ఉన్నతాధికారులకు అందజేశారు.
నీరవ్ మోదీని భారత్‌కు తీసుకువచ్చిన వెంటనే ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకు తరలించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సమాచారం. అక్కడ ఇప్పటికే అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఖైదీల కోసం నిర్మించిన ప్రత్యేక సెల్‌లో ఆయనను ఉంచనున్నారు. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పీఎన్‌బీ కుంభకోణం కేసు విచారణలో కీలక పురోగతి లభించనుంది.