AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా పీవోకేలో భారీ నిరసనలు.. రోడ్ల పైకి వచ్చిన ప్రజలు..

పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజలు భారీ ఆందోళన చేపట్టారు. అవామీ యాక్షన్ కమిటీ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ నిరసనలను సోమవారం మరింత ఉద్ధృతం చేయనున్నట్లు నిరసనకారుల ప్రతినిధులు తెలిపారు. పాకిస్థాన్ ప్రభుత్వం దశాబ్దాలుగా తమను రాజకీయంగా, ఆర్థికంగా అణగదొక్కుతోందని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు.

 

70 ఏళ్లకు పైగా పీవోకే ప్రజలకు కనీస ప్రాథమిక హక్కులు కూడా కల్పించలేదని అవామీ యాక్షన్ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవోకేలో మౌలిక సంస్కరణలు తీసుకురావాలని, తమ 38 డిమాండ్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ‘షటర్ డౌన్ వీల్ జామ్’ పేరుతో అవామీ సమ్మెకు పిలుపునిచ్చారు.

 

ఈ క్రమంలోనే పీవోకేలోని పలు ప్రాంతాల్లో ప్రజలు పాకిస్థాన్ బలవంతపు ఆక్రమణల నుంచి విముక్తి కల్పించాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపడానికి ముందుకురావాలని అవామీ యాక్షన్ కమిటీ కోరింది. ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించింది. నిరసనలు తీవ్రమవుతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం పీవోకేలో పోలీసులను మోహరించింది. ఇంటర్నెట్‌ను నిలిపివేసింది.

ANN TOP 10