AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్ సంచలన నిర్ణయం… విదేశీ సినిమాలపై 100 శాతం సుంకం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ సినీ పరిశ్రమను కుదిపేసే సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికా వెలుపల నిర్మించిన ఏ సినిమాపైనైనా సరే 100 శాతం సుంకం (టారిఫ్) విధిస్తున్నట్లు సోమవారం వెల్లడించారు. తన సోషల్ మీడియా వేదికైన ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ నిర్ణయం హాలీవుడ్‌తో పాటు అంతర్జాతీయ చిత్ర రంగంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

 

ఈ సందర్భంగా ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మన సినిమా నిర్మాణ వ్యాపారాన్ని ఇతర దేశాలు దొంగిలించాయి. పసిపిల్లల నుంచి మిఠాయిని దొంగిలించినంత సులువుగా దీన్ని చేసేశాయి. ముఖ్యంగా బలహీనమైన, అసమర్థుడైన గవర్నర్ పాలనలో ఉన్న కాలిఫోర్నియా రాష్ట్రం దీనివల్ల తీవ్రంగా నష్టపోయింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ముగింపు పలికేందుకే, అమెరికా బయట చిత్రీకరణ జరుపుకునే అన్ని సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నాను” అని ఆయన తన పోస్టులో స్పష్టం చేశారు.

 

విదేశీ చిత్రాలపై ట్రంప్ కఠిన వైఖరి తీసుకోవడం ఇదేమీ కొత్త కాదు. గత మే నెలలో కూడా ఆయన ఇలాంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. విదేశీ సినిమా నిర్మాణాలు అమెరికా జాతీయ భద్రతకు పెను ముప్పుగా పరిణమించాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశీ ప్రొడక్షన్లు అమెరికన్ ఫిల్మ్ మేకర్లను తమ దేశాలకు ఆకర్షిస్తూ, ఇక్కడి చిత్రాల్లోకి తమ భావజాలాన్ని, ప్రచారాన్ని చొప్పిస్తున్నాయని ఆయన గతంలో ఆరోపించారు. ఇప్పుడు ఏకంగా 100 శాతం సుంకం విధిస్తున్నట్లు చేసిన ప్రకటనతో ఈ విషయంపై తన వైఖరిని మరింత కఠినతరం చేశారు. ఈ నిర్ణయం అమలులోకి వస్తే, అమెరికాలో విదేశీ చిత్రాల విడుదల, పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

ANN TOP 10