తెలంగాణ సాంస్కృతిక ప్రతీక అయిన బతుకమ్మ పండుగ రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. హైదరాబాద్లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ ఉత్సవం ఈ ఘనత సాధించింది. అతిపెద్ద జానపద నృత్యంగా, అలాగే అతిపెద్ద బతుకమ్మగా ఈ కార్యక్రమం రికార్డు సృష్టించింది.
గిన్నిస్ రికార్డు సాధన లక్ష్యంగా సరూర్ నగర్ స్టేడియంలో సోమవారం బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా 63 అడుగుల ఎత్తయిన భారీ బతుకమ్మను ప్రత్యేకంగా రూపొందించారు. అనంతరం, ఒకేసారి 1354 మంది మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క బతుకమ్మ పాట పాడి అందరినీ అలరించారు.









