AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

భారత మెసేజింగ్ యాప్ అరట్టై మార్కెట్లో సంచలనం..! దెబ్బకు వాట్సాప్ విలవిల..!

భారత మెసేజింగ్ యాప్ అరట్టై మార్కెట్లో సంచలనం సృష్టిస్తోంది. ప్రముఖ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్‌ను వెనక్కి నెట్టి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ‘అరట్టై’ యాప్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. యాపిల్ యాప్ స్టోర్‌లోని సోషల్ నెట్‌వర్కింగ్ విభాగంలో తాము అధికారికంగా నెంబర్ 1 స్థానానికి చేరుకున్నట్లు అరట్టై మాతృసంస్థ ‘జోహో’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ యాప్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.

 

ఎందుకీ ఆదరణ?

తమిళంలో ‘కబుర్లు’ అని అర్థం వచ్చే ‘అరట్టై’ పేరుతో 2021లో ఈ యాప్ ప్రారంభమైంది. అయితే ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వంటి ప్రముఖులు స్వదేశీ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను ప్రోత్సహించాలని పిలుపునివ్వడం ఈ యాప్‌కు కలిసొచ్చింది. దీనికి తోడు ‘స్పైవేర్ రహిత – మేడ్ ఇన్ ఇండియా’ అనే నినాదం కూడా వినియోగదారులను బాగా ఆకర్షించింది. దీంతో దేశభక్తితో పాటు, తమ డేటా భద్రతకు ప్రాధాన్యమిచ్చే యూజర్లు పెద్ద సంఖ్యలో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రముఖ టెక్ వ్యాపారవేత్త వివేక్ వాధ్వా సైతం ఈ యాప్‌ను ‘ఇండియాస్ వాట్సాప్ కిల్లర్’ అని ప్రశంసించారు.

 

విజయం వెనుక సవాళ్లు

ఊహించని రీతిలో వినియోగదారులు వెల్లువెత్తడంతో అరట్టై సర్వర్లపై తీవ్ర ఒత్తిడి పడింది. దీంతో చాలా మంది యూజర్లకు ఓటీపీలు ఆలస్యంగా రావడం, కాంటాక్ట్‌లు సింక్ అవ్వకపోవడం, కాల్స్‌లో సమస్యలు వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యలను అంగీకరించిన జోహో, సర్వర్ల సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నామని, ఈ సమస్యలను సరిదిద్దడానికి రెండు రోజులు పట్టవచ్చని తెలిపింది.

 

ప్రస్తుతం అరట్టై యాప్‌లో ఆడియో, వీడియో కాల్స్‌కు మాత్రమే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ సదుపాయం ఉంది. అయితే వాట్సాప్‌లో ఉన్నట్లుగా చాట్‌లకు ఈ భద్రతా ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఈ ఫీచర్‌ను తీసుకొస్తామని కంపెనీ చెబుతోంది. ఈ కీలకమైన భద్రతా లోపం ఉన్నప్పటికీ, స్వదేశీ యాప్ కావడం, యూజర్ల డేటాను వ్యాపారానికి వాడుకోమని జోహో హామీ ఇవ్వడం వంటి అంశాలు అరట్టైకి సానుకూలంగా మారాయి. ప్రస్తుతం వచ్చిన ఈ ఆదరణను నిలబెట్టుకుని, సాంకేతిక సమస్యలను అధిగమిస్తేనే అరట్టై దీర్ఘకాలంలో వాట్సాప్‌కు నిజమైన పోటీదారుగా నిలవగలదు.

ANN TOP 10