AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఉపాధి హామీలో కొత్త రూల్..! నకిలీ మస్టర్లకు కేంద్రం చెక్..!

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అక్రమాలకు, నకిలీ మస్టర్లకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ విధానం ప్రకారం, పనికి హాజరయ్యే ప్రతి కూలీకి ఈ-కేవైసీ తప్పనిసరి చేయడంతో పాటు, ముఖ ఆధారిత హాజరు (ఫేస్ అటెండెన్స్) నమోదు చేయనున్నారు. ఈ కొత్త నిబంధనలతో బోగస్ హాజరుకు పూర్తిగా చరమగీతం పాడవచ్చని అధికారులు భావిస్తున్నారు.

 

ఏమిటీ కొత్త విధానం?

ఇకపై ఉపాధి పనులకు వచ్చే ప్రతి శ్రామికుడి ఫొటోను రోజుకు రెండుసార్లు ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. వారి జాబ్ కార్డుకు ఆధార్ అనుసంధానం చేసి, ఈ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. దీనివల్ల అసలైన లబ్ధిదారుడు మాత్రమే పనికి హాజరయ్యేలా, వారి బ్యాంకు ఖాతాకే నేరుగా వేతనం జమ అయ్యేలా చూడవచ్చు. ఒకరి బదులు మరొకరు పనికి రావడం, నకిలీ ఫొటోలు అప్‌లోడ్ చేయడం వంటి మోసాలకు తావుండదని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

 

ఏపీలో రెండు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్

ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ప్రతి రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు, చిత్తూరు జిల్లాలను ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70.73 లక్షల జాబ్‌కార్డులు ఉండగా, చాలాచోట్ల కార్డులు ఉన్నవారు పనికి రాకుండా వారి బదులు ఇతరులను పంపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. క్షేత్రస్థాయి సిబ్బందితో కుమ్మక్కై కొందరు ఈ అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటికే ఉన్న ఎన్ఎంఎంఎస్ యాప్‌ను కూడా కొందరు దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో, ఈ-కేవైసీ, ముఖ ఆధారిత హాజరు విధానం కచ్చితమైన ఫలితాలనిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ANN TOP 10