వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడదల రజనిపైనే తొలి ఫిర్యాదు నమోదు కావడం తీవ్ర కలకలం రేపుతోంది. తనపై దాడి చేయించారంటూ నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఈ ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే, 2022లో పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని తన ఇల్లు, పార్టీ కార్యాలయం, కారుపై అప్పటి మంత్రి విడదల రజిని దాడి చేయించారని రావు సుబ్రహ్మణ్యం ఆరోపించారు. ఈ ఘటనపై చర్యలు తీసుకుని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన నేరుగా వైసీపీ ‘డిజిటల్ బుక్’ యాప్ ద్వారా జగన్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం, యాప్‌లో ఫిర్యాదు నమోదు కాగానే వచ్చిన కంప్లైంట్ టికెట్‌ను ఆయన మీడియాకు ప్రదర్శించారు.
ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, “మాజీ మంత్రి రజనిపై చర్యలు తీసుకుని, నాకు న్యాయం చేయాలని జగన్ గారిని కోరాను. ఈ ఫిర్యాదుపై సరైన విచారణ జరిపిస్తే, జగన్ చెప్పినట్లుగా ఈ యాప్ ద్వారా కార్యకర్తలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతుంది” అని పేర్కొన్నారు.
టీడీపీ నేతలు తమను వేధిస్తున్న వారి పేర్లను ‘రెడ్ బుక్’లో రాస్తున్నారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, వైసీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసా ఇస్తూ జగన్ ఈ ‘డిజిటల్ బుక్’ యాప్‌ను ప్రారంభించారు. ఇది కార్యకర్తలకు శ్రీరామరక్ష అని, అధికారంలోకి వచ్చాక ప్రతీ ఒక్కరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు సొంత పార్టీ మాజీ మంత్రిపైనే ఈ యాప్‌లో ఫిర్యాదు అందడంతో, వైసీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.