తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి ఇప్పుడు విద్యుత్ విషయంలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా, యావత్ దక్షిణ భారతదేశంలోనే తొలి సంపూర్ణ సౌర గ్రామంగా రికార్డు సృష్టించింది. ఈ ఘనత సాధించిన రెండో భారతీయ గ్రామంగా కూడా నిలిచింది.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరిత ఇంధన పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. గ్రామంలోని 514 ఇళ్లు, 11 ప్రభుత్వ భవనాలకు సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 480 ఇళ్లపై 3 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ ప్యానెళ్లను, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలపై 60 కిలోవాట్ల సోలార్ యూనిట్లను బిగించారు. ప్రతి ఇంటికి నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండటంతో, గ్రామస్థులకు నిరంతరాయ విద్యుత్‌తో పాటు నెలవారీ బిల్లుల భారం పూర్తిగా తప్పిపోయింది.
ఈ ప్రాజెక్టు ప్రత్యేకత కేవలం విద్యుత్ స్వయం సమృద్ధితోనే ఆగిపోలేదు. గ్రామ అవసరాలు తీరగా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు సరఫరా చేస్తూ గ్రామస్థులు ఆదాయం కూడా పొందుతున్నారు. యూనిట్‌కు రూ. 5.25 చొప్పున అమ్ముతూ, కేవలం సెప్టెంబర్ నెలలోనే లక్ష యూనిట్ల విద్యుత్‌ను విక్రయించి దాదాపు రూ. 5 లక్షలు సంపాదించారు. దీంతో గ్రామస్థులు హరిత పారిశ్రామికవేత్తలుగా మారారని అధికారులు చెబుతున్నారు.
మొత్తం రూ. 10.53 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టును తెలంగాణ పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీరెడ్కో) పూర్తి చేసింది. దీనికి కేంద్ర ప్రభుత్వం రూ. 3.56 కోట్ల సబ్సిడీ అందించగా, ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ సీఎస్ఆర్ నిధుల కింద రూ. 4.09 కోట్లు సమకూర్చింది. మౌలిక వసతుల కోసం మరో రూ. 2.59 కోట్లు ఖర్చు చేశారు. ప్రభుత్వ దార్శనికత, కార్పొరేట్ మద్దతు, ప్రజా భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో కొండారెడ్డిపల్లి నిరూపిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఇది కర్బన ఉద్గారాలను తగ్గించి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసే దిశగా ఒక చారిత్రక మైలురాయి అని వారు అభివర్ణించారు.