AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆట మైదానంలో ‘ఆపరేషన్ సిందూర్’..! టీమిండియా గెలుపు పై ప్రధాని మోదీ స్పందన..

ఆసియా కప్ ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై భారత క్రికెట్ జట్టు సాధించిన విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో స్పందించారు. టీమిండియా ఆటగాళ్లకు అభినందనలు తెలుపుతూ ఆయన చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన అభినందన సందేశంలో ‘ఆపరేషన్ సిందూర్’ అనే పదాన్ని ప్రయోగించడం విశేషం.

 

క్రీడా మైదానంలో భారత జట్టు చూపిన అద్భుత ప్రదర్శనను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. “ఆట మైదానంలో ఆపరేషన్ సిందూర్.. ఎక్కడైనా ఫలితం ఒక్కటే – భారత్ విజేత!” అని ఆయన పేర్కొన్నారు. ఈ విజయం సాధించిన మన క్రికెటర్లకు అభినందనలు అంటూ తన పోస్టును ముగించారు.

 

సాధారణంగా భారత జట్టు కీలక విజయాలు నమోదు చేసినప్పుడు ప్రధాని మోదీ అభినందనలు తెలపడం పరిపాటి. అయితే ఈసారి కాస్త వినూత్నంగా, ఒక ప్రత్యేకమైన పదాన్ని ఉపయోగించి శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. భారత విజయాన్ని ‘ఆపరేషన్ సిందూర్’ తో పోల్చడం ద్వారా గెలుపు ప్రాధాన్యతను ఆయన చెప్పకనే చెప్పారు. ఈ విజయం పట్ల దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రధాని అభినందనలు జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.

 

దుబాయ్ లో ఆదివారం నాడు రోమాంఛకంగా సాగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పాక్ 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. 147 పరుగుల లక్ష్యఛేదనలో భారత్ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసి విజయభేరి మోగించింది. ఈ విజయంలో తెలుగు ఆటగాడు తిలక్ వర్మ 69 పరుగులతో అజేయంగా నిలిచి కీలక పాత్ర పోషించాడు.

ANN TOP 10