ఆసియా కప్ ఫైనల్లో పాకిస్థాన్‌పై టీమిండియా సాధించిన అద్భుత విజయాన్ని బీసీసీఐ ప్రశంసించింది. ఈ చారిత్రక గెలుపును పురస్కరించుకుని ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ఏకంగా రూ. 21 కోట్ల భారీ ప్రైజ్ మనీ ప్రకటించింది. దుబాయ్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో ఓడించి భారత్ తొమ్మిదోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది.
ఈ విజయంపై బీసీసీఐ సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. “మూడు దెబ్బలు.. సమాధానమే లేదు. ఆసియా కప్ ఛాంపియన్లు. సందేశం పంపించాం. జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల బహుమతి” అని బీసీసీఐ పేర్కొంది. ఈ టోర్నమెంట్లో పాకిస్థాన్‌తో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ భారత్ గెలవడాన్ని ఉద్దేశిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. ఒక దశలో 12.4 ఓవర్లలో 113/1 పరుగులతో పటిష్ఠంగా కనిపించిన పాక్, భారత బౌలర్ల ధాటికి అనూహ్యంగా కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్ కీలక వికెట్లు తీయడంతో పాక్ జట్టు 146 పరుగులకే ఆలౌట్ అయింది.
అనంతరం 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ విఫలమయ్యారు. ఈ క్లిష్ట సమయంలో తిలక్ వర్మ అద్భుతంగా ఆడి అజేయంగా 69 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. దీంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే భారత్ విజయాన్ని అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో గెలిచి 9వ సారి టైటిల్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఆసియా క్రికెట్లో తమ ఆధిపత్యాన్ని టీమిండియా మరోసారి నిరూపించుకుంది.
