AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికకు ఈసీ సన్నాహాలు.. రంగంలోకి కేంద్ర పరిశీలకులు..

తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) సన్నాహాలు ప్రారంభించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికలను స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఈసీ కీలక చర్యలు చేపట్టింది.

 

ఈ మేరకు ఆదివారం ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది. జూబ్లీహిల్స్‌తో పాటు, బిహార్ అసెంబ్లీ ఎన్నికలు, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మరికొన్ని అసెంబ్లీ స్థానాలకు కలిపి మొత్తం 470 మంది సీనియర్ అధికారులను కేంద్ర పరిశీలకులుగా నియమించినట్లు తెలిపింది. ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చుపై ఈ బృందాలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తాయని స్పష్టం చేసింది.

 

ఈ పరిశీలకులు జూబ్లీహిల్స్‌తో పాటు జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం, నౌగ్రోటా, రాజస్థాన్‌లోని అంటా, ఝార్ఖండ్‌లోని ఘాట్‌శిల, పంజాబ్‌లోని తరన్ తారన్, మిజోరంలోని దంప, ఒడిసాలోని నువాపడ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో కూడా విధులు నిర్వర్తిస్తారని ఎన్నికల సంఘం తన ప్రకటనలో వివరించింది.

 

ఇదే సమయంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ‘మిషన్ బిహార్ విజయం’ లక్ష్యంగా ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా, కొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 45 మంది ఎంపీలు, సీనియర్ నేతలకు కీలక బాధ్యతలు అప్పగించింది. వీరంతా తమకు కేటాయించిన లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో పార్టీ గెలుపు కోసం పనిచేయనున్నారు.

ANN TOP 10