AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశాఖ భాగస్వామ్య సదస్సు.. అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌..

విశాఖపట్నం వేదికగా నవంబర్ 14, 15 తేదీల్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించ తలపెట్టిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ఏర్పాట్లపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సదస్సును విజయవంతం చేసి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

 

ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి మంత్రి లోకేశ్‌ ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఏర్పాట్ల పర్యవేక్షణకు నియమించిన వివిధ కమిటీల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. సదస్సు విజయవంతానికి చేపడుతున్న చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

 

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌ మాట్లాడుతూ, సదస్సు ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. “రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణాన్ని, ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలి. కేవలం ఒక్క జూమ్ కాల్ ద్వారా ఆర్సెల్లర్ మిట్టల్ వంటి పెద్ద సంస్థ రాష్ట్రానికి వచ్చింది. క్లస్టర్ల వారీగా పెట్టుబడులను ఆకర్షించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి” అని ఆయన అధికారులకు సూచించారు.

 

సదస్సు అజెండా, వేదిక రూపకల్పన, నమూనాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ నెలలో వివిధ దేశాల్లో చేపట్టనున్న రోడ్ షోల గురించి అధికారులు మంత్రికి వివరించారు. ఆహ్వానాలు, ప్రోటోకాల్, వసతి, రవాణా, భద్రత, నగర సుందరీకరణ, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు మీడియా ప్రచారంపై ఆయా కమిటీలు తమ ప్రణాళికలను తెలియజేశాయి.

 

ఇదే కార్యక్రమంలో భాగస్వామ్య సదస్సు-2025 అధికారిక వెబ్‌సైట్‌ను మంత్రి లోకేశ్‌ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సమీక్షలో మంత్రులు పి. నారాయణ, టీజీ భరత్, కందుల దుర్గేశ్‌, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

ANN TOP 10