AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..! చెక్ బౌన్స్ కేసుల్లో కొత్త రూల్స్..

దేశవ్యాప్తంగా కోర్టుల్లో పేరుకుపోయిన లక్షలాది చెక్ బౌన్స్ కేసుల సత్వర పరిష్కారం కోసం సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. నిందితులు చెక్ మొత్తాన్ని చెల్లించడం ద్వారా కేసులను వివిధ దశల్లో ముగించుకునేందుకు వీలుగా, జరిమానాలతో కూడిన ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించింది. జస్టిస్ మన్మోహన్, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు వెలువరించింది.

 

కొత్త మార్గదర్శకాల ప్రకారం, చెక్ బౌన్స్ కేసులో నిందితులు తమ వాంగ్మూలాన్ని కోర్టులో నమోదు చేయడానికి ముందే చెక్‌పై ఉన్న పూర్తి మొత్తాన్ని చెల్లిస్తే, వారిపై ఎలాంటి జరిమానా విధించకుండానే కేసును కొట్టివేయాలని ట్రయల్ కోర్టులకు ధర్మాసనం స్పష్టం చేసింది. ఒకవేళ వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత, కానీ తీర్పు వెలువడక ముందే డబ్బు చెల్లిస్తే, చెక్ మొత్తంపై 5 శాతం జరిమానాగా విధించి కేసును ముగించవచ్చని తెలిపింది. ఈ జరిమానా మొత్తాన్ని న్యాయ సేవా ప్రాధికార సంస్థకు జమ చేయాల్సి ఉంటుంది.

 

ఈ కేసులు పై కోర్టులకు వెళ్లినప్పుడు జరిమానా శాతం పెరుగుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. కేసు సెషన్స్ కోర్టు లేదా హైకోర్టు దశలో ఉన్నప్పుడు రాజీ కుదిరితే చెక్ మొత్తంపై అదనంగా 7.5 శాతం చెల్లించాల్సి ఉంటుంది. అదే కేసు సుప్రీంకోర్టు వరకు వస్తే, ఈ జరిమానా 10 శాతానికి పెరుగుతుందని ధర్మాసనం వివరించింది. దేశంలోని ప్రధాన నగరాల జిల్లా కోర్టుల్లో చెక్ బౌన్స్ కేసులు భారీగా పెరిగిపోవడంపై ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాసనం, 15 ఏళ్ల నాటి నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ (ఎన్‌ఐ) చట్టంలోని నిబంధనలను సవరిస్తూ ఈ కొత్త విధానాన్ని రూపొందించింది.

 

చెక్ బౌన్స్ కేసుల విచారణలో జాప్యానికి నిందితులకు సమన్లు జారీ చేసే ప్రక్రియ ఒక ప్రధాన కారణంగా ఉందని అభిప్రాయపడిన సుప్రీంకోర్టు, ఇకపై ‘దస్తీ సమన్ల’ (ఫిర్యాదిదారుడే నేరుగా సమన్లు అందించడం) విధానాన్ని కూడా అనుమతించాలని ఆదేశించింది. ఈ చర్యల ద్వారా కేసుల విచారణ వేగవంతమై, కోర్టులపై భారం తగ్గుతుందని భావిస్తున్నారు.

ANN TOP 10