AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమలాపురంలో వాసవీ అమ్మవారికి 4.42 కోట్ల కరెన్సీతో అలంకారం.. !

ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని రోజుకొక ప్రత్యేక రూపంలో అలంకరించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రధానంగా వాసవీ మాత అమ్మవారి ఆలయాల్లో పెద్ద ఎత్తున కరెన్సీ నోట్లతో అమ్మవారికి అలంకరణ చేయడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

 

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని కలెక్టరేట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మహాలక్ష్మీదేవి రూపంలో అమ్మవారిని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారితో పాటు ఆలయాన్ని భారీగా కరెన్సీ నోట్లతో అలంకరించారు. ఈ ఆలయంలో ఏకంగా ఒక్క రూపాయి తక్కువ 4 కోట్ల 42 లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అమ్మవారిని, ఆలయాన్ని అలంకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

 

కరెన్సీ నోట్ల అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి బారులు తీరారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ క్రమంలో నిర్వహకులు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ ప్రత్యేక అలంకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ANN TOP 10