తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఏకంగా 23 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పుల్లో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా సీనియర్ అధికారి వీసీ సజ్జనార్‌ను నియమించారు.
ప్రస్తుతం హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న సీవీ ఆనంద్‌ను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేశారు. ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సజ్జనార్ ఆయన స్థానంలోకి రానున్నారు. ఖాళీ అయిన ఆర్టీసీ ఎండీ పోస్టులో నాగిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.
ఈ బదిలీల్లో పలువురు ఇతర సీనియర్ అధికారులకు కూడా కీలక బాధ్యతలు అప్పగించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా శిఖా గోయల్‌ను నియమించారు. ప్రస్తుతం సీఐడీ అదనపు డీజీగా ఉన్న చారుసిన్హాకు ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా స్వాతిలక్రాకు అదనపు బాధ్యతలు కేటాయించారు.
వీరితో పాటు, ఇంటెలిజెన్స్ డీజీగా విజయ్ కుమార్, మల్టీజోన్-2 ఐజీగా డీఎస్ చౌహాన్, విపత్తు నిర్వహణ, ఫైర్ సర్వీసెస్ డీజీగా విక్రమ్‌సింగ్, పౌరసరఫరాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా స్టీఫెన్ రవీంద్ర బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.