సిర్పూర్ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీ గూటికి చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి కూడా పాల్గొన్నారు. కోనేరు కోనప్పతో పాటు ఆయన సోదరుడు కోనేరు కృష్ణారావు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కోనేరు కోనప్ప బీఆర్ఎస్ తరపున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత ఆయన ఆ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. గత కొంతకాలంగా ఆయన కేసీఆర్ నాయకత్వానికి అనుకూలంగా ప్రకటనలు చేస్తుండటంతో తిరిగి పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపించాయి. ఈరోజు ఎర్రవెల్లిలో కేటీఆర్, హరీశ్ రావుల సమక్షంలో ఆయన తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.