అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ఫార్మా రంగానికి భారీ షాక్ ఇచ్చేలా సంచలన నిర్ణయం తీసుకున్నారు. బ్రాండెడ్, పేటెంట్ పొందిన ఔషధాల దిగుమతిపై 100 శాతం వరకు సుంకాలు విధిస్తున్నట్లు గురువారం ప్రకటించారు. ఈ కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. అయితే, అమెరికాలో తయారీ ప్లాంట్లను నిర్మిస్తున్న కంపెనీలకు ఈ సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం భారత ఔషధ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా ఈ ప్రకటన చేశారు. “అమెరికాలో ఫార్మాస్యూటికల్ తయారీ ప్లాంట్‌ను నిర్మించని ఏ కంపెనీ దిగుమతి చేసుకున్నా, 2025 అక్టోబర్ 1 నుంచి 100 శాతం సుంకం విధిస్తాం. ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించినా లేదా నిర్మాణంలో ఉన్నా ఈ సుంకాలు వర్తించవు” అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. దేశీయ తయారీని ప్రోత్సహించడం, ప్రభుత్వ బడ్జెట్ లోటును తగ్గించడంతో పాటు జాతీయ భద్రత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఔషధాలతో పాటు కిచెన్ కేబినెట్లు, ఫర్నిచర్, భారీ ట్రక్కుల వంటి ఇతర వస్తువులపైనా ఆయన దిగుమతి సుంకాలను పెంచారు.
ఈ నిర్ణయం భారత్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఎందుకంటే భారత ఫార్మా ఉత్పత్తులకు అమెరికానే అతిపెద్ద ఎగుమతి మార్కెట్. ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం, 2024 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి జరిగిన మొత్తం 27.9 బిలియన్ డాలర్ల ఫార్మా ఎగుమతుల్లో సుమారు 31 శాతం, అంటే 8.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 77,231 కోట్లు) విలువైన ఉత్పత్తులు అమెరికాకే వెళ్లాయి. అమెరికాలో వినియోగించే జెనరిక్ మందుల్లో 45 శాతానికి పైగా భారత్ నుంచే సరఫరా అవుతున్నాయి. డాక్టర్ రెడ్డీస్, అరబిందో ఫార్మా, జైడస్ లైఫ్‌సైన్సెస్ వంటి అనేక ప్రముఖ భారతీయ కంపెనీలు తమ ఆదాయంలో 30 నుంచి 50 శాతం వరకు అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి.
ప్రస్తుతానికి ఈ సుంకాలు బ్రాండెడ్, పేటెంట్ మందులకే పరిమితమని చెప్పినప్పటికీ, భవిష్యత్తులో కాంప్లెక్స్ జెనరిక్స్, స్పెషాలిటీ మందులపైనా ఈ ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన నెలకొంది. ఈ సుంకాల వల్ల అమెరికాలో మందుల ధరలు విపరీతంగా పెరిగి, ద్రవ్యోల్బణానికి దారితీయడంతో పాటు ఔషధాల కొరత కూడా ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే తక్కువ లాభాలతో పనిచేస్తున్న భారత కంపెనీలకు ఈ అదనపు భారం మోయలేనిదిగా మారవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.