AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కాళేశ్వరం కేసులో సీబీఐ ముందడుగు.. రంగంలోకి దర్యాప్తు బృందాలు..!

కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న అవకతవకల ఆరోపణలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎట్టకేలకు రంగంలోకి దిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు, ఈ కేసులో ప్రాథమిక ఆధారాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే దర్యాప్తునకు సంబంధించిన కీలక సమాచారాన్ని, నివేదికలను తమకు అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి గురువారం సీబీఐ అధికారులు లేఖ రాసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

 

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (ఎన్‌డీఎస్ఏ), రాష్ట్ర విజిలెన్స్ కమిషన్, విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలన్నింటినీ తమకు పంపించాలని సీబీఐ తన లేఖలో కోరినట్లు సమాచారం. ఈ పరిణామంతో సీఎస్ సంబంధిత శాఖల అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.

 

జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన అనంతరం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి అధికారికంగా లేఖ రాసింది. గత కేసీఆర్ ప్రభుత్వం సీబీఐ విచారణలకు అనుమతి నిరాకరిస్తూ జారీ చేసిన జీవో 51ని పక్కనపెట్టి, కేవలం కాళేశ్వరం కేసుకు మినహాయింపునిస్తూ రేవంత్ సర్కారు జీవో 104ను విడుదల చేసింది.

 

ప్రభుత్వం నుంచి అందే నివేదికలను సీబీఐ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వాటిలో నేరాన్ని నిరూపించే ప్రాథమిక సమాచారం ఉందని నిర్ధారణకు వస్తే, న్యాయవిభాగం సలహా తీసుకుని ప్రాథమిక విచారణ (పీఈ) నమోదు చేస్తారు. ఈ కేసులో పలువురు ప్రభుత్వ అధికారులు, ఐఏఎస్ అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నందున పూర్తిస్థాయిలో కేసు నమోదు చేయడానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి. అవినీతి నిరోధక చట్టం కింద దర్యాప్తు ప్రారంభించాలంటే కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా, ప్రజాప్రతినిధులపై కేసు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి కూడా అవసరం. ఈ చట్టపరమైన ప్రక్రియలన్నీ పూర్తయ్యాకే సీబీఐ పూర్తిస్థాయి దర్యాప్తు ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ANN TOP 10