AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జీఎస్టీ తగ్గింపు ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.11 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం వినియోగదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే దేశవ్యాప్తంగా కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా డిజిటల్ చెల్లింపులు ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో పెరిగాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం జీఎస్టీ రేట్లు తగ్గిన తొలిరోజైన సెప్టెంబర్ 22న ఏకంగా రూ.11 లక్షల కోట్ల విలువైన డిజిటల్ లావాదేవీలు నమోదయ్యాయి.

 

అంతకుముందు రోజు, అంటే సెప్టెంబర్ 21న దేశవ్యాప్తంగా నమోదైన డిజిటల్ చెల్లింపుల విలువ కేవలం రూ.1.1 లక్షల కోట్లు మాత్రమే. అయితే, జీఎస్టీ తగ్గింపు అమల్లోకి వచ్చిన ఒక్క రోజులోనే ఈ లావాదేవీలు ఏకంగా 10 రెట్లు పెరగడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వినియోగదారులు ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారని ఈ సంఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.

 

ఈ భారీ లావాదేవీల్లో సింహభాగం ఆర్‌టీజీఎస్ ద్వారా జరిగినవే కావడం గమనార్హం. ఆర్‌టీజీఎస్ ద్వారా రూ. 8.2 లక్షల కోట్లు, నెఫ్ట్ ద్వారా రూ. 1.6 లక్షల కోట్లు, యూపీఐ ద్వారా రూ. 82,477 కోట్ల చెల్లింపులు జరిగినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. వీటితో పాటు ఐఎంపీఎస్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కూడా గణనీయమైన లావాదేవీలు జరిగాయి.

 

జీఎస్టీ తగ్గింపు ప్రభావం ఈ-కామర్స్ రంగంపైనా స్పష్టంగా కనిపించింది. ప్రముఖ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘రెడ్‌సీర్’ నివేదిక ప్రకారం, రేట్లు తగ్గిన తొలి రెండు రోజుల్లోనే ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో అమ్మకాలు 23 నుంచి 25 శాతం మేర పెరిగాయి. ముఖ్యంగా ఆన్‌లైన్ లావాదేవీల్లో క్రెడిట్ కార్డుల వాడకం భారీగా పెరిగింది. క్రెడిట్ కార్డు చెల్లింపులు దాదాపు 6 రెట్లు పెరిగి రూ.10,411 కోట్లకు చేరగా, డెబిట్ కార్డుల ద్వారా జరిగిన చెల్లింపులు 4 రెట్లు పెరిగి రూ.814 కోట్లుగా నమోదయ్యాయని ఆ సంస్థ తెలిపింది.

ANN TOP 10