AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

దేశంలోని వైద్య సంస్థలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రాయోజిత పథకం స్టేజ్-IIIను బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్ల పరిమితితో 5,000 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

10 వేల సీట్లు పెంపు

తాజా నిర్ణయంతో దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వీలవుతుందని కేబినెట్ తెలిపింది. ప్రభుత్వ వైద్య కాలేజీల అప్‌గ్రేడేషన్ ద్వారా 5,000 కొత్త పోస్ట్‌గ్రాడ్యుయేట్ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెంచేందుకు ఆమోదం తెలిపింది. తాజా మార్పులతో దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్లు 1,18,190లకు, పీజీ సీట్లు 74,306కి చేరుకోనున్నాయి.

 

వైద్య సీట్ల పెంపుతో వైద్య విద్య సామర్థ్యాన్ని పెంచడం,స్పెషలిస్ట్ వైద్యుల లభ్యత, ప్రభుత్వ వైద్య సంస్థలలో కొత్త స్పెషాలిటీలు ప్రవేశపెట్టడం పెరుగుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. దీంతోపాటు దేశంలో వైద్యుల సంఖ్య పెరిగి ఆరోగ్య నెట్ వర్క్ బలోపేతం అవుతుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఒక ప్రకటనలో తెలిపింది.

 

రూ.15 వేల కోట్లతో

మొత్తం రూ.15,034.50 కోట్ల బడ్జెట్ (2025-26 నుంచి 2028 29 వరకు)తో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అమలు చేయనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ.10,303.20 కోట్లు కాగా, రాష్ట్రాలు రూ.4,731.30 కోట్లు సమకూర్చనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా వైద్యులు, స్పెషలిస్టుల సంఖ్యను పెంచి, గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను మెరుగుపరచమే లక్ష్యమని కేంద్రం తెలిపింది.

 

ప్రస్తుతం దేశంలో 808 మెడికల్ కాలేజీల్లో 1,23,700 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, డిమాండ్‌కు తగిన సామర్థ్యం పెంచడం అవసరమని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ లక్ష్యంలో భాగంగా దేశ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎస్ఎస్ అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.

 

యూనివర్సల్ హెల్త్ కవరేజ్

అన్ని స్థాయిలలో 1.4 బిలియన్ల మందికి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ (UHC)ని సాధించి, బలమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధాన్ మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (PMSSY) కింద ఇరవై రెండు కొత్త ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) ఆరోగ్య సేవలను అందించడానికి ఈ ప్రణాళికను ఆమోదించామని పేర్కొంది.

ANN TOP 10