పోలీసులకు అందిన ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్ఎస్ఎల్ నివేదిక పోలీసులకు చేరింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు అధికారులు పంపించారు. ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను కూడా అధికారులు పంపించారు. ఈ నెల 11న కోర్టులో కేసు నివేదికను సిట్ సమర్పించనుంది. ఎన్నారై ప్రశాంత్‌పై మరోసారి సిట్ నోటీసులు జారీ చేయనుంది.
తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ అంశం సంచలనం రేపుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ కేసులో 16 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. వారిని చంచల్‌గూడ జైల్లో ఉంచారు. రిమాండ్‌లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి కీలక విషయాలు రాబట్టారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగులు ప్రవీణ్, రాజశేఖర్ పేపర్ లీక్ చేసి రేణుక, డాక్యా నాయక్‌తో పాటు పలువురికి విక్రయించినట్లు విచారణలో బయటపడింది. వారి ద్వారా మరికొంతమందికి పేపర్ లీక్ అయినట్లు తేలింది.
ఒకరి ద్వారా మరొకరికి పేపర్ చేరింది. ప్రవీణ్, రాజశేఖర్ నుంచి రూ.15 లక్షలకు పేపర్ తీసుకున్న నిందితులు.. మరికొంతమందికి విక్రయించారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఇలా ఎప్పటినుంచి పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇలా ఇంకా ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనేది ఆందోళనకరంగా మారింది. అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు లీక్ చేసినట్లు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేసిన టీఎస్‌పీఎస్సీ.. ఇటీవల కొత్తగా షెడ్యూల్ ప్రకటించింది. మరోవైపు పేపర్ లీక్ కేసుపై ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నిందితుల మధ్య లావాదేవీల విషయంపై ఆరా తీస్తోంది.