AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గ్రూప్ 1 తుది ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్‌సీ..

రాష్ట్రంలోని 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు సంబంధించిన తుది ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీ‌పీఎస్‌సీ) నిన్న అర్ధరాత్రి తర్వాత విడుదల చేసింది. హైకోర్టు తాజా ఉత్తర్వులతో నియామక ప్రక్రియ కొనసాగించేందుకు మార్గం సుగమం కావడంతో, కమిషన్ తుది ఎంపికల జాబితాను విడుదల చేసింది.

 

కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపిన వివరాల ప్రకారం.. మొత్తం 563 ఖాళీలకు గాను 562 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్‌హెల్డ్‌ (తాత్కాలికంగా నిలిపివేత) కింద ఉంచినట్లు వెల్లడించారు.

 

ఎంపిక ప్రక్రియ వివరాలు

 

ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితా మెరిట్, పోస్టుల ప్రాధాన్యత, రిజర్వేషన్, రోస్టర్ విధానాల ఆధారంగా రూపొందించబడినట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు ముఖ్యంగా తాము కోరిన పోస్టులను ఎంపిక చేసుకున్న క్రమం, ప్రధాన పరీక్షల్లో పొందిన మార్కులు తదితరాలను పరిగణనలోకి తీసుకుని తుది ఎంపికలు పూర్తయ్యాయి.

 

మల్టీజోన్-1లో: 258 పోస్టులు

మల్టీజోన్-2లో: 304 పోస్టులు

 

టాప్-10 ర్యాంకర్లు – అందరూ ఆర్డీవోలకు ఎంపిక

ఈసారి గ్రూప్-1 ఫలితాల్లో టాప్-10 ర్యాంకులు సాధించిన అభ్యర్థులంతా ఆర్డీవో (ఆర్‌డీఓ) పోస్టులను ఎంపిక చేసుకున్నారు.

 

టాప్‌ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు వీరే: లక్ష్మీదీపిక, దాడి వెంకటరమణ, వంశీకృష్ణారెడ్డి, జిన్నా తేజస్విని, కృతిక, హర్షవర్ధన్, అనూష, నిఖిత, భవ్య, శ్రీకృష్ణసాయి.

 

డాక్టర్ లక్ష్మీదీపికకు ఫస్ట్ ర్యాంక్: హైదరాబాద్‌ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన డాక్టర్ లక్ష్మీదీపిక 550 మార్కులతో రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. ఆమె ఉస్మానియా యూనివర్సిటీలో వైద్య విద్య పూర్తిచేసింది. మల్టీజోన్-2 కేటగిరీలో ఆమెకు ఆర్డీవో పోస్టు లభించింది.

 

ఇక మల్టీజోన్-1 టాపర్ అయిన హనుమకొండ జిల్లాకు చెందిన జిన్నా తేజస్విని 532 మార్కులతో ఆర్డీవోగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు.

 

నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రెండో ర్యాంకును సాధించారు. ఆయన కూడా ఆర్డీవో పోస్టును పొందారు.

 

హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును నిన్న హైకోర్టు ధర్మాసనం నిలిపివేయడంతో, ఫలితాల ప్రకటనకు మార్గం సుగమం అయింది. ఈ క్రమంలో అర్ధరాత్రివరకు కమిషన్ కసరత్తు చేసి తుది ఎంపికల జాబితాను విడుదల చేసింది.

 

ఎవరైనా అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిర్ధారణ అయితే తక్షణమే నియామకాన్ని రద్దు చేయనున్నట్లు కమిషన్ స్పష్టం చేసింది. కాగా, జనరల్ మెరిట్‌లో టాప్-10లో 6 మంది మహిళలు ఉన్నారు. టాప్-100లో 41 మంది మహిళలు ఉన్నారు. టాప్ 100లో తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ఐదుగురు సత్తా చాటారు.

ANN TOP 10