వైసీపీ అధినేత జగన్కు ప్రతిపక్ష నేత హోదా కల్పించే విషయంలో ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా ఉంటే ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని, లేదంటే ఆ విషయాన్ని అంగీకరించాలని ఆయన సవాల్ విసిరారు.
బుధవారం మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జగన్కు ప్రతిపక్ష హోదాను నిరాకరిస్తోందని ఆరోపించారు. “వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకంత భయం? జగన్ అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పలేమనే ఆందోళనతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అందుకే మేము న్యాయపోరాటం కోసం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది” అని ఆయన స్పష్టం చేశారు.
కూటమి పాలన తీరు ప్రజలకు ఇప్పటికే అర్థమైపోయిందని, రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా విజయం వైసీపీదేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఏ ఎన్నికనైనా ఎదుర్కోవడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని పేర్ని నాని తెలిపారు.
ఇదిలా ఉండగా, తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అధ్యక్షతన వైసీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, పీఏసీ సభ్యులు, జిల్లా అధ్యక్షులతో పాటు పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు. పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజా సమస్యలపై పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.