AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. 12,000 ఉద్యోగాలతో..

ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రాబోతోంది. ప్రపంచ ప్రఖ్యాత టెక్ కన్సల్టెన్సీ సంస్థ ‘యాక్సెంచర్’ వైజాగ్‌లో తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఇక్కడ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసి, సుమారు 12,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించాలని యోచిస్తున్నట్లు ప్రతిపాదించింది. ఈ మేరకు తమకు పది ఎకరాల భూమిని ఎకరా 99 పైసల నామమాత్రపు లీజుకు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్లు ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ మంగళవారం ఒక కథనంలో వెల్లడించింది.

 

ఈ ప్రతిపాదనపై పూర్తి వివరాలను రాష్ట్ర ప్రభుత్వమే వెల్లడిస్తుందని యాక్సెంచర్ పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 7.9 లక్షల మంది ఉద్యోగులతో కార్యకలాపాలు సాగిస్తున్న యాక్సెంచర్‌లో దాదాపు మూడు లక్షల మంది భారతీయులే పనిచేస్తున్నారు. ఇంతటి భారీ సంస్థ విశాఖకు వస్తే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు పెరగడంతో పాటు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని ఐటీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

క్యూ కడుతున్న కంపెనీలు

విశాఖకు రానున్న ఏకైక పెద్ద సంస్థ యాక్సెంచర్ మాత్రమే కాదు. ఇప్పటికే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ. 1,370 కోట్ల పెట్టుబడితో 12 వేల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించింది. ఈ సంస్థకు ఐటీ హిల్ నంబరు-3లో 21.6 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. అదేవిధంగా, మరో టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ కూడా కాపులుప్పాడలో తమ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. రూ. 1,582.98 కోట్ల పెట్టుబడితో 8,000 మందికి ఉపాధి కల్పించనున్న ఈ సంస్థకు కూడా ప్రభుత్వం ఎకరా 99 పైసలకే భూమిని లీజుకు ఇచ్చేందుకు అంగీకరించింది.

 

ఆకర్షిస్తున్న ఐటీ పాలసీ

కొవిడ్ మహమ్మారి తర్వాత ఐటీ కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో నగరాలకు బదులుగా విశాఖ వంటి ద్వితీయ శ్రేణి నగరాలపై దృష్టి సారిస్తున్నాయి. తక్కువ ధరకే భూములు అందుబాటులో ఉండటం, పోటీ జీతాలకు నైపుణ్యం కలిగిన మానవ వనరులు లభించడం, ట్రాఫిక్ సమస్యలు తక్కువగా ఉండటం వంటివి ఇందుకు ప్రధాన కారణాలు. దీనికితోడు, ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఐటీ పాలసీ బడా కంపెనీలను విశేషంగా ఆకర్షిస్తోంది. భారీగా ఉద్యోగాలు కల్పించే సంస్థలకు నామమాత్రపు ధరకే భూములు కేటాయిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించడం, ఆ హామీని అమలు చేస్తుండటంతో మరిన్ని కంపెనీలు ఏపీ వైపు చూస్తున్నాయి.

ANN TOP 10