AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

డ్రిప్ ఇరిగేషన్ తానే తెచ్చానని చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.. కాకాణి కీలక వాఖ్యలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఏమాత్రం ఇష్టం లేదని, ఆయనో రైతు వ్యతిరేకి అని మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం అగచాట్లు పడుతుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పుణ్యం వల్లే రైతులు తీవ్ర నష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆరోపించారు.

 

“గతంలో కంటే ఎక్కువ యూరియా తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం, అది రైతులకు ఎందుకు అందడం లేదో చెప్పాలి. రైతులకు చేరాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్‌కు ఎలా తరలిపోతోంది? ఈ ప్రభుత్వ పెద్దలకు రైతుల కష్టాలు కనిపించడం లేదా?” అని నిలదీశారు. ధాన్యం కేవలం ఆల్కహాల్ తయారీకేనని, తినడానికి పనికిరాదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం సిగ్గుచేటని ఆయన అన్నారు.

 

అసెంబ్లీలో చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని కాకాణి కొట్టిపారేశారు. “1991లోనే రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ ప్రారంభమైతే, 1995లో ముఖ్యమంత్రి అయిన తాను తెచ్చానని నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు. దేశానికి కూడా తానే డ్రిప్ ఇరిగేషన్ పరిచయం చేశానని చెప్పడం హాస్యాస్పదం” అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మిర్చి, పొగాకు, ఉల్లి, టమాటా రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

 

జగన్ పాలనలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నామని, పంటలకు ముందే ధరలు ప్రకటించి భరోసా ఇచ్చామని కాకాణి గుర్తుచేశారు. కానీ, ఈ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను కూడా సరిగా నిర్వహించలేని దిక్కుమాలిన స్థితిలో ఉందని విమర్శించారు. రైతుల కష్టాలను స్వయంగా చూపిస్తామని, తమతో కలిసి పొలాలకు వచ్చే దమ్ము ప్రభుత్వ పెద్దలకు ఉందా? అని ఆయన సవాల్ విసిరారు. పశువులకు హాస్టళ్లు కట్టడం కాదని, పాల ధరకు గిట్టుబాటు ధర ఇస్తే చాలని హితవు పలికారు. రైతుల పక్షాన వైసీపీ పోరాటం కొనసాగుతుందని కాకాణి స్పష్టం చేశారు.

ANN TOP 10