AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెడికల్ కాలేజీలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..!

ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో అభివృద్ధి చేసే నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇది ప్రైవేటీకరణ కాదని, బెదిరింపులకు భయపడి మంచి నిర్ణయాలను ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో సాగునీటి రంగంపై జరిగిన చర్చ సందర్భంగా ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

 

పీపీపీ విధానం వల్ల ఎవరికీ నష్టం జరగదని సీఎం భరోసా ఇచ్చారు. “హైవేలను పీపీపీ పద్ధతిలో నిర్మించారు. అంతమాత్రాన ఆ రోడ్లు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేసినట్టా? ఆస్తి ప్రభుత్వానిదే. గడువు ముగిశాక ప్రభుత్వానికే అప్పగిస్తారు. అదేవిధంగా మెడికల్ కాలేజీల యాజమాన్యం కూడా ప్రభుత్వానిదే” అని ఆయన వివరించారు. ఈ విధానం ద్వారా నాణ్యత పెరిగి, పేదలకు ఉచితంగా మెరుగైన సేవలు అందుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.

 

అంతకుముందు, రాష్ట్రంలో జలవనరుల అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల కోసం కూటమి ప్రభుత్వం రూ. 60 వేల కోట్లు ఖర్చు చేయనుందని ప్రకటించారు. సమర్థవంతమైన నీటి యాజమాన్యంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

 

గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల పోలవరం ప్రాజెక్టు తీవ్రంగా నష్టపోయిందని చంద్రబాబు విమర్శించారు. దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ను రూ. 1000 కోట్లతో పునర్నిర్మిస్తున్నామని తెలిపారు. 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో తాము 72 శాతం పనులు పూర్తి చేస్తే, ఐదేళ్లలో కేవలం 3.84 శాతం పనులు మాత్రమే జరిగాయని ఆరోపించారు.

 

ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పెండింగ్ ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని సీఎం చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల కోసం రూ. 2097 కోట్లు, రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ. 7803 కోట్లు కేటాయించి నిర్ణీత వ్యవధిలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. హంద్రీనీవా ద్వారా కుప్పానికి నీరందించడం తన జన్మను సార్థకం చేసిందన్నారు.

 

గత ఐదేళ్లలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఎత్తిపోతల పథకాలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నదుల అనుసంధానంపై కూడా సీఎం ప్రస్తావించారు. గోదావరి నీటిని బనకచర్ల వరకు తరలిస్తే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందని, వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

ANN TOP 10